Home South Zone Andhra Pradesh దశాబ్దంలో ఉమ్మడి నగరంగా అమరావతి-గుంటూరు-విజయవాడ

దశాబ్దంలో ఉమ్మడి నగరంగా అమరావతి-గుంటూరు-విజయవాడ

0
0

దశాబ్దంలో ఉమ్మడి నగరంగా అమరావతి-గుంటూరు-విజయవాడ
30-01-2026 Fri 18:08 | Andhra
Chandrababu Naidu Predicts Amaravati Guntur Vijayawada Merge in 10 Years
గుంటూరు జీజీహెచ్‌లో మాతాశిశు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆర్థిక అసమానతలు తగ్గించేందుకే పీ4 కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ కోసం ‘సంజీవని’ ప్రాజెక్టుకు శ్రీకారం
ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డను మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు అందిస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన ‘కానూరి-జింఖానా’ మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ కేంద్రం నిర్మాణం కోసం గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఏకంగా రూ.100 కోట్లు విరాళంగా సమకూర్చగా, ప్రభుత్వం పరికరాలు, ఫర్నిచర్ కోసం మరో రూ.27 కోట్లు వెచ్చించింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, “సంపాదించిన దానిలో కొంత సమాజ సేవకు కేటాయించినప్పుడు కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. సమాజంలో ఇంకా మంచితనం మిగిలే ఉందని ప్రవాసాంధ్రులు నిరూపించారు. సాధారణంగా దశాబ్దాల క్రితం విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారు జన్మభూమిని మరచిపోతారు.

కానీ మీరు చదువుకున్న కళాశాలను గుర్తుపెట్టుకుని 1981లోనే జింఖానా సంస్థను ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సాయం చేయడం అభినందనీయం. భవన నిర్మాణంతో పాటు, భవిష్యత్తులో దాని నిర్వహణకు ఆటంకాలు రాకుండా బ్యాంకులో కొంత సొమ్ము డిపాజిట్ చేయడం మీ ముందుచూపునకు నిదర్శనం” అని ప్రశంసించారు.

పేదల అభ్యున్నతికే ‘పీ4’
రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తగ్గించే లక్ష్యంతోనే తాను ‘పీ4’ (ప్రజా భాగస్వామ్యంతో పేదరికంపై గెలుపు) కార్యక్రమాన్ని తీసుకొచ్చానని ముఖ్యమంత్రి వివరించారు. “కేంద్ర ప్రభుత్వం రహదారులు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాల కోసం పీ4 మోడల్‌ను ప్రోత్సహిస్తోంది. కానీ నేను పేదల అభ్యున్నతి కోసం పీ4ను అమలు చేస్తున్నాను.

పేదలు సంపాదించే స్థాయికి చేరితేనే సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు తగ్గుతాయి. చదువు అనేది ఒక గేమ్ ఛేంజర్. అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి మహనీయులు ఆర్థిక సాయంతోనే ఉన్నత స్థాయికి చేరారు. పీ4 కార్యక్రమం ద్వారా ఇప్పటికే 10.42 లక్షల మందిని లక్షా 2 వేల మంది దాతలు దత్తత తీసుకున్నారు. ప్రవాసాంధ్రులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై పేదలకు అండగా నిలవాలి” అని పిలుపునిచ్చారు.

అమరావతిపై దార్శనికత.. అభివృద్ధిపై ధీమా
రానున్న పదేళ్లలో గుంటూరు, అమరావతి ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. “గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోతాయి. 182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు రానుంది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలన్నది నా లక్ష్యం.

ఒకప్పుడు సైబరాబాద్ నిర్మించాం, ఇప్పుడు అమరావతిలో ‘క్వాంటమ్ వ్యాలీ’కి శ్రీకారం చుడుతున్నాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనతో ముందుకు వెళుతున్నాం” అని అన్నారు. 1995లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని, నేడు దేశం విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు.

NO COMMENTS