కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయానంటూ మహిళ ఆవేదన
విశాఖ విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు
బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన బాధితురాలు
సోమవారం నాడు సచివాలయానికి రావాలని కుటుంబానికి ఆహ్వానం
విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి
చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకుండా చూడాలని ఆ మహిళ కన్నీటితో వేడుకుంది. ఆమె వేదనకు చలించిన పవన్ కల్యాణ్, బాధిత కుటుంబాన్ని సోమవారం సచివాలయంలోని తన కార్యాలయానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే, శుక్రవారం రాత్రి తన విశాఖ పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో విమానాశ్రయంలో పట్నాల ఉమాదేవి అనే మహిళ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిశారు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ప్రసవం కోసం తాను కేజీహెచ్‌లో చేరానని, అప్పటి నుంచి వైద్యులు, సిబ్బంది తన పట్ల అత్యంత నిర్లక్ష్యంగా, అమానవీయంగా ప్రవర్తించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
“కాన్పుకు ఇచ్చిన గడువు ముగిసిపోయిందని చెప్పినా వారు పట్టించుకోలేదు. సాధారణ ప్రసవం పేరుతో నన్ను నరకయాతనకు గురిచేశారు. నా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు పదేపదే చెప్పినా వినలేదు.
పైగా మాపై తీవ్ర పదజాలంతో దూషించారు. ప్రసవ సమయంలో ఒకరు నా గుండెలపైకి ఎక్కి కూర్చొని నొప్పితో విలవిల్లాడుతున్నా కనికరించలేదు” అని ఉమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో సిజేరియన్ చేయకపోవడం వల్లే తాను మృత శిశువుకు జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె వాపోయారు.
కేజీహెచ్ సిబ్బంది తీరు వల్ల తనకు శారీరక హింసతో పాటు జీవితాంతం మరిచిపోలేని మానసిక వేదన మిగిలిందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఉప ముఖ్యమంత్రిని కోరారు.
ఉమాదేవి ఆవేదనను ఓపికగా విన్న పవన్ కల్యాణ్ వెంటనే చలించిపోయారు. ఆమెకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని, తగిన న్యాయం చేసేందుకు ఆమెను.
ఆమె కుటుంబ సభ్యులను తన కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కూడా మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది.




