కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
బెగ్గిపల్లె గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ
లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు విచారణ
పథకాల అమలు తీరుపై స్వయంగా ఆరా తీసిన ముఖ్యమంత్రి
ముగ్గురు లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పింఛన్లు అందజేత.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. శనివారం ఆయన బెగ్గిపల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి, వారిని ఆప్యాయంగా పలకరించారు.
గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వారి యోగక్షేమాలను విచారించి, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముగ్గురు లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పింఛన్లు అందించారు.
మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్నతాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛను అందజేసి వారికి భరోసా కల్పించారు. ముఖ్యమంత్రే నేరుగా తమ ఇంటికి వచ్చి పింఛను అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంలో భాగంగా సీఎం ఈ కార్యక్రమం చేపట్టారు.




