కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన కూలీలు చెట్లు నరికే పనుల కోసం ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీరాంపురం గ్రామం నుంచి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెట్లు నరికే పనుల నిమిత్తం 14 మంది కూలీలతో ఆటో బయలుదేరింది. ఈ క్రమంలో కత్తిపూడి వద్ద పిఠాపురం నుంచి రౌతులపూడి వైపు వెళుతున్న టిప్పర్ లారీని ఆటో బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమవ్వగా, అందులో ప్రయాణిస్తున్న కూలీలు రోడ్డుపై పడిపోయారు.
ఈ ప్రమాదంలో శ్రీరాంపురం గ్రామానికి చెందిన పితాని కామరాజు (65) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో పన్నెండు మంది కూలీలు గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని ఆటోల్లో, అంబులెన్సుల్లో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. #దడాల babji




