గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు
తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు పామాయిల్, రసాయనాలు వాడారని వ్యాఖ్య
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కూడా లక్ష కల్తీ లడ్డూలు పంపారని ఆరోపణ
గత ప్రభుత్వం దేవుడిపైనే పగబట్టిందని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శ
ఈ వ్యవహారంలో ఎక్కడా సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని.
వాస్తవాలు బయటపెడతామని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, ఇందులో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదని హెచ్చరించారు.
నెయ్యి పేరుతో పామాయిల్, ప్రమాదకరమైన రసాయనాలు వాడి భక్తుల మనోభావాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేటప్పుడు తాము అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడారు.
