కాకినాడ: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ప్రభావంతో కాకినాడ సముద్ర పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి.
కార్మికుల పోరుకు మద్దతుగా కార్మిక సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. సముద్ర పోర్టులో కార్గో లోడింగ్, అన్లోడింగ్ కార్యకలాపాలు ఆగిపోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోడ్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కార్మికుల హక్కులను కాలరాసేలా ఈ కోడ్లు ఉన్నాయని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళారి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. వేతన సమరక్షణ, పని గంటల పెంపు, ఈపీఎఫ్, బోనస్ వంటి అంశాల్లో కార్మికులకు తుంగలో తొక్కేలా లేబర్ కోడ్ ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
