భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సోమవారం నిత్య కల్యాణ వేడుక కనువిందుగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన వేడుకల్లో భాగంగా, స్వామివారిని బేడ మండపానికి వేంచేపు చేశారు.
అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల నడుమ సీతారాములకు కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ గావించి శాస్త్రోక్తంగా కల్యాణాన్ని జరిపించారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని వీక్షించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.








