రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తన విన్నపం మేరకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిలిపివేశారని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేత బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించకపోవడాన్ని బట్టి చూస్తే, ఆయన చెప్పింది నిజమేనని ఒప్పుకున్నట్లు భావించాలా అని ప్రశ్నించారు.
ఇది రాయలసీమ ప్రజలకు జరుగుతున్న తీరని అన్యాయమని, తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై లేనిపోని నిందలు వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, కానీ కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాత్రం మౌనంగా ఉన్నారని మండిపడ్డారు.










