చీరాల పట్టణం లో రద్దీగా ఉండే నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలు సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఒక ట్రాక్టర్ ట్రాలీ నిండుగా, ఎటువంటి రక్షణ కవచం తార్పాలిన్ వంటివి లేకుండా మట్టి, రాళ్లను తరలిస్తూ కనిపించింది.
ట్రాలీలో మట్టిని దాని సామర్థ్యం కంటే ఎక్కువగా నింపడం వల్ల, ప్రయాణంలో ఆ మట్టి రోడ్డుపై పడే అవకాశం ఉంది. దీనివల్ల వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు జారి పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, గాలికి మట్టి రేణువులు ఎగిరి వాహనదారుల కళ్లలో పడటంతో తృటిలో ప్రమాదాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
రద్దీగా ఉండే రోడ్లపై ఇలాంటి వాహనాలు వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా, పాదచారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించే ఇలాంటి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి ట్రాక్టర్ లోడు పై ఖచ్చితంగా వెనక డోర్లు ,కవర్లు ఉండేలా చూడాలని స్థానికులు కోరారు .
