పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు.
మంగళవారం పెద్దాపురం మండలం గోరింట, వడ్లమూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రబీ పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటల సాగులో సమతుల్యంగా ఎరువులు వాడాలని, పరిమితికి మించి యూరియా వినియోగిస్తే పంటలకు మరియు నేల నాణ్యతకు నష్టం కలుగుతుందని తెలిపారు.
రైతులు ప్రభుత్వం రూపొందించిన ఫార్మర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా పంటల వివరాలు, వ్యవసాయ సూచనలు, ప్రభుత్వ పథకాల సమాచారం పొందవచ్చని వివరించారు.
ఈ పర్యటనలో మండల వ్యవసాయ అధికారి సంజయ్ కుమార్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.
