తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం తరహాలో, తిరుపతి సమీపంలోని వకుళమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ‘అక్షర గోవిందం’ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విజ్ఞప్తి మేరకు ఈ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
3 నుండి 5 ఏళ్ల చిన్నారుల కోసం ప్రత్యేక మండపాన్ని నిర్మించి, శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. అనంతరం పలక, బలపం, అక్షతలు, ప్రసాదంతో కూడిన 7 వస్తువుల ప్రత్యేక కిట్‌ను అందజేస్తారు. ఈ నిర్ణయంతో భక్తులు తమ పిల్లలకు శ్రీవారి తల్లి ఆశీస్సులతో విద్యాభ్యాసం ప్రారంభించే అవకాశం కలగనుంది.










