హైదరాబాద్ : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మెల్లగా బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా పార్టీ వర్గాల్లో కొనసాగుతున్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తోంది. సీనియర్ నేతల అసహనం, కొందరు ఎమ్మెల్యేల రహస్య భేటీలతో గాంధీభవన్లో రాజకీయ చర్చలు వేడెక్కాయి.
జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత టి. జీవన్ రెడ్డి పార్టీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
తన రాజకీయ ప్రత్యర్థి సంజయ్ కుమార్ కు పార్టీలో ప్రాధాన్యం పెరుగుతోందన్న భావనతో ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రాజీనామా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇక మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో మంత్రి పదవుల కేటాయింపులు, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
పార్టీలో పాత నేతలు, ఇటీవల చేరిన వలస నేతల మధ్య కూడా అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి కి రాజ్యసభ అవకాశం ఇవ్వడంపై కొందరు సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పదవుల కేటాయింపులో పాత నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో ఏనుగు రవీందర్ రెడ్డి భవిష్యత్ రాజకీయ నిర్ణయాలపై కూడా చర్చ సాగుతోంది. ఆయన పార్టీ మారే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వరంగల్ జిల్లాలో కూడా రాజకీయ పోటీ పెరుగుతోంది. కొండా కుటుంబం మరియు, రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్టు స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పరకాల నియోజకవర్గ రాజకీయాలపై కూడా చర్చలు సాగుతున్నాయి.
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ కూడా తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు గా తెలుస్తోంది . త్వరలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ కూడా పార్టీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రాబోయే మండలి ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసే దిశగా కమ్యూనిస్టు పార్టీ ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నేతల నియోజకవర్గాల్లో పాత, కొత్త కార్యకర్తల మధ్య కూడా విభేదాలు కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు పార్టీ అంతర్గత పరిస్థితులపై చర్చకు దారితీస్తున్నాయి.
మొత్తం మీద ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీ అధిష్ఠానం పరిస్థితిని ఎలా చక్కదిద్దుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
#Sidhumaroju
Alwal










