Chandrababu Naidu: తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

0
2

తిరుమల శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచే దిశగా కీలక అడుగు పడింది. తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబరేటరీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మించిన అత్యాధునిక వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి, పప్పులు, ఇతర ముడిసరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి, భక్తులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఈ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమల వచ్చిన సీఎం వెంట ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో మహాద్వారం ద్వారా నేరుగా ఆలయ ప్రవేశం చేసే అవకాశం ఉన్నప్పటికీ, తన ఆనవాయతీని కొనసాగిస్తూ సామాన్య భక్తుడిలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే స్వామివారి దర్శనానికి వెళ్లారు. సీఎం అయిన తొలిసారి నుంచి ఆయన ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించగా, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ప్రతి ఏటా మనవడు దేవాన్ష్ పుట్టినరోజున అన్నదాన ట్రస్టుకు విరాళం ఇచ్చే సంప్రదాయాన్ని చంద్రబాబు కుటుంబం కొనసాగిస్తోంది. ఈ ఏడాది కూడా ఒకరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షల విరాళాన్ని అన్నదానం ట్రస్టుకు అందజేశారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 12 సార్లు ఈ విరాళాన్ని అందించారు.

దర్శనానంతరం సీఎం, ఆయన కుటుంబ సభ్యులు కాలినడకన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకున్నారు. అక్కడ భోజనం చేస్తున్న భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించి, వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మాడ వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్న ముఖ్యమంత్రిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో, చంద్రబాబు తన సెక్యూరిటీ ప్రోటోకాల్ ను పక్కనపెట్టి, నేరుగా భక్తుల వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేస్తూ, ఫొటోలు దిగుతూ ఆనందం కలిగించారు. ఈ క్రమంలో ఓ భక్తురాలు సీఎంకు కరుంగళి మాలను బహూకరించగా, ఆయన ఆప్యాయంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా తిరుమలలో అందుతున్న సౌకర్యాలపై సీఎం భక్తులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం నాణ్యత గురించి అడగ్గా, గతంతో పోలిస్తే నాణ్యత చాలా మెరుగుపడిందని, రుచి బాగుందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం మరింత వేగంగా జరిగేలా చూడాలని కొందరు భక్తులు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా శ్రీవారి దర్శనం మరింత సులభతరం, త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు