స్విమ్మింగ్ పూల్స్‌లో సరదా… భద్రతలో శూన్యం! ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నిర్లక్ష్యం”|

0
31

హైదరాబాద్ : వేసవి సెలవులు ప్రారంభం కావడంతో నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ పిల్లల కేరింతలతో కిటకిటలాడుతున్నాయి. కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు పూల్స్‌ను సందర్శిస్తుండటంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

అయితే, ఈ సందడి వెనుక ఉన్న నిర్వాహకుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలు పసిపిల్లలతో పాటు యువత ప్రాణాలకూ ముప్పుగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవల ఆల్వాల్ ప్రాంతంలో జరిగిన విషాద ఘటనలు ఈ పరిస్థితికి నిదర్శనంగా నిలిచాయి.
స్విమ్మింగ్ పూల్స్ నిర్వహణను ఆదాయ వనరుగా భావిస్తున్న కొందరు నిర్వాహకులు, నెలనెలా లాభాల కోసం కనీస భద్రతా ప్రమాణాలను విస్మరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు ఇవే.. పర్యవేక్షణ ఎక్కడ?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రతి స్విమ్మింగ్ పూల్ మున్సిపల్, పోలీస్, ఫైర్, హెల్త్ శాఖల అనుమతులు తప్పనిసరిగా పొందాలి.
అదనంగా, కొన్ని సందర్భాల్లో భూసంబంధిత అంశాల దృష్ట్యా ఎమ్మార్వో కార్యాలయం నుండి, అలాగే నీటి వనరులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ నుండి అనుమతులు (NOC) అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు.
అయితే, క్షేత్రస్థాయిలో అనేక పూల్స్ ఈ నిబంధనలను పూర్తిగా పాటించడం లేదని తెలుస్తోంది.
నిర్మాణ లోపాలు, భద్రతా ప్రమాదాలు:
పూల్ లోపల నాణ్యమైన టైల్స్ వాడుతున్నప్పటికీ, బయట నడిచే ప్రదేశాల్లో యాంటీ-స్లిప్ టైల్స్ లేకపోవడం వల్ల జారి పడే ప్రమాదం పెరుగుతోంది.

విద్యుత్ భద్రత విషయంలోనూ లోపాలు కనిపిస్తున్నాయి. కరెంటు లీకేజీలను అరికట్టే పరికరాలు లేకపోవడం, విద్యుత్ నిలిచిపోయినప్పుడు బ్యాకప్ లైటింగ్ లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది.

లైఫ్‌గార్డ్స్ లేకపోవడం ప్రధాన లోపం:
స్విమ్మింగ్ పూల్స్‌లో నిపుణులైన లైఫ్‌గార్డ్స్ నిరంతరం పూల్‌ను పర్యవేక్షిస్తూ ఉండాలి.  అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి ప్రాణాలను కాపాడే బాధ్యత వారి మీద ఉంటుంది. లైఫ్‌గార్డ్స్‌కు ప్రాథమిక వైద్య సహాయం (CPR)పై శిక్షణ ఉండటం తప్పనిసరి.

అదేవిధంగా, లైఫ్ బోయ్‌లు, రిస్క్యూ ట్యూబ్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు వంటి అత్యవసర పరికరాలు అందుబాటులో ఉండాలి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా షాలో పూల్స్ లేదా భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సిన అవసరం ఉంది.

అయితే, చాలా చోట్ల శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడం లేదా సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రమాదాలు తీవ్రమవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

నీటి నిర్వహణలో నిర్లక్ష్యం:
స్విమ్మింగ్ పూల్ నీటిని ఫిల్ట్రేషన్, క్లోరినేషన్ ద్వారా నిరంతరం శుభ్రంగా ఉంచాలి. సాధారణంగా నీటిని 3 నుంచి 6 నెలలకు ఒకసారి పూర్తిగా మార్చడం అవసరం.
అయితే మధ్యలో సరైన నిర్వహణ లేకపోతే నీరు త్వరగా కలుషితమై ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉంది.

పూల్ నుండి తీసివేసిన నీటిని మున్సిపల్ డ్రైనేజ్ వ్యవస్థలో లేదా అనుమతులతోనే విడుదల చేయాలి. క్లోరిన్ కలిగిన నీటిని ఎక్కడపడితే అక్కడ వదలడం పర్యావరణానికి హానికరం.

పరిశుభ్రత, క్రమశిక్షణ లోపం:
పూల్‌లోకి వెళ్లే ముందు షవర్ బాత్ తీసుకోవడం, సరైన స్విమ్మింగ్ దుస్తులు ధరించడం వంటి ప్రాథమిక నియమాలు అమలు కావడం లేదు.

సామర్థ్యానికి మించి జనాలను అనుమతించడం వల్ల ఒకరినొకరు ఢీకొట్టడం, ఊపిరాడకపోవడం వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

రాజకీయ ప్రభావమా?
ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ, స్విమ్మింగ్ పూల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు చురుకుదనం చూపడం లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
కొంతమంది రాజకీయ నాయకుల ప్రభావం కారణంగా నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారులు మేల్కొనాలి:
ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. నీటి నాణ్యత, భద్రతా ప్రమాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
భద్రతా నిబంధనలు ఉల్లంఘించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే లైసెన్స్‌లను రద్దు చేయాలి. పసిప్రాణాల భద్రతే ముఖ్యమని భావించి అధికారులు బాధ్యతతో వ్యవహరించాలి.
ఇప్పటికైనా అధికారులు మేల్కొని నిబంధనలు పాటించని స్విమ్మింగ్ పూల్స్‌పై కఠిన చర్యలు తీసుకుని, మరో దుర్ఘటన చోటుచేసుకునేలోపే మాతృమూర్తుల కడుపుకోతకు తెరదించుతారని ప్రజలు కోరుచున్నారు.

#Sidhumaroju✍️
Alwal