ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్నేరు నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తెలంగాణకు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అధిక వేగంతో, భారీ శబ్దాలతో గ్రామం గుండా వెళ్తున్న వాహనాల వల్ల ప్రాణభయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతోందని, ఒక్కో ట్రక్కుకు రూ. 3,000 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామస్తులు ఎదురుతిరగడంతో దుండగులు ఇసుక ట్రాలీని అక్కడే వదిలేసి పరారయ్యారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.










