ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఇంధన కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో యాజమాన్యాలు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టాయి. దీంతో పెట్రోల్ కోసం వాహనదారులు ఊరి బయట ఉన్న బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు.
ద్విచక్ర వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా బాటిళ్లలో పెట్రోల్ పోస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. లోడ్ రాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, డీజిల్ కూడా పరిమితంగానే ఉందని బంక్ నిర్వాహకులు చెబుతున్నారు. ముందస్తు సమాచారం లేక ఇబ్బంది పడుతున్నామని, అధికారులు తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.










