దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లోక్‌సభతోపాటు 28 రాష్ర్టాల్లోని శాసనసభ స్థానాలను దామాషా లెక్కన 50 శాతం పెంచాలని నిర్ణయించింది.
దీని ప్రకారం.. ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి చేరుకోనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 4,123 అసెంబ్లీ స్థానాలు కూ డా 6,185కు చేరుతాయి. పెరిగిన స్థానాలకు లోబడే నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టనున్నారు. డీలిమిటేషన్ జరిగిన నియోజకవర్గాల్లో 33 శాతం స్థానాలకు మహిళా రిజర్వేషన్ వర్తింపజేయనున్నారు. దామాషా ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కూడా పెంచనున్నారు. ఈ ప్రక్రియనంతటినీ పూర్తి చేసిన తర్వాతనే 2029 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడానికి కేంద్రం యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావడానికి చర్చలు మొదలుపెట్టిన కేంద్రం ..
అవసరమైతే బడ్జెట్ సమావేశాలను పొడిగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే విషయమై ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు జరిపినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో 50 శాతం సీట్లు పెరుగాలి. అంటే కొత్తగా తెలంగాణలో 8.5 (17లో సగం) లోక్‌సభ స్థానాలు, 59.5 (119లో సగం) అసెంబ్లీ స్థానాలు పెరుగాలి. అయితే, 50 శాతం స్థానాలు పెంచేటప్పుడు 0.5 లెక్కన స్థానాలు వస్తే, దాన్ని ఒకటిగానే పరిగణిస్తారు. దీంతో తెలంగాణలో లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయి. అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కు చేరుతాయి. ఈ లెక్కన లోక్‌సభలో తెలంగాణకు ఎంపీ సీట్లు పెరుగుతాయి. అయితే, ప్రాతినిధ్య శాతంలో ఎలాంటి మార్పు మాత్రం ఉండదు.










