తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ డా. జైశెట్టి రమణయ్య గారి మరణం పట్ల, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు.
ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్య గారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గారు స్మరించుకున్నారు.
రమణయ్య గారు సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గారు గుర్తు చేసుకున్నారు.
వారి మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కాగా.. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా డా. జైశెట్టి రమణయ్య పని చేశారు.
చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా వారికి పేరున్నది.
సౌత్ ఇండియా టెంపుల్స్” అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య గారు పీహెచ్డీ డాక్టర్ పట్టాను పొందారు.










