చీరాల పట్టణంలోని వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మోయిన్ సూచనలతో శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శక్తి టీం ఎస్సై హరిబాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని ఒక భారంగా భావించకూడదని, అది ప్రాణరక్షణకు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. వాహనదారులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారి నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా చీరాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి తనిఖీలు అవగాహన సదస్సులు నిరంతరం కొనసాగుతాయని శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు, పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.










