శిరోరక్ష – ప్రాణ రక్ష: హెల్మెట్ వాడకంపై బాపట్ల పోలీసుల మెగా బైక్ అవగాహన ర్యాలీ.

0
5

చీరాల

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ పరిధిలో ‘శిరోరక్ష – ప్రాణ రక్ష’ పేరుతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందు వరుసలో పోలీసులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు అందరూ హెల్మెట్ ధరించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

చీరాల పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీలో ఎస్పీ ఉమామహేశ్వర్ పాటు డి.ఎస్.పి మోయిన్, సబ్ డివిజన్ సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు మరియు శక్తి టీం పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం తలకు తగిలే గాయాలే హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుండి 90% వరకు తప్పించుకోవచ్చని పోలీసులు ప్రజలకు వివరించారు.

గత కొన్ని నెలలుగా జిల్లాలో జరుగుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే, హెల్మెట్ లేకపోవడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అందుకే వచ్చే 10-15 రోజుల పాటు విద్యార్థులు, యువత, ప్రభుత్వ సిబ్బంది మరియు సామాన్య ప్రజలలో హెల్మెట్ ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పిస్తాం. కేవలం చట్టం కోసమో, జరిమానాల కోసమో కాకుండా, మీ కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ ధరించాలి. పోలీస్ శాఖ నుండే ఈ మార్పు మొదలు కావాలని సిబ్బంది అందరూ హెల్మెట్ ధరించారు.

రానున్న రోజుల్లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. బాపట్ల జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమం ద్వారా బాపట్ల పోలీసులు సామాజిక బాధ్యతను చాటుకుంటూ, ప్రజల ప్రాణాల రక్షణకు పెద్దపీట వేశారు.