వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా తాగునీటి సరఫరాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం ముత్యాలంపాడు, సత్యనారాయణపురంలోని ఆర్వో (RO) ప్లాంట్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నీటి శుద్ధి ప్రక్రియ, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించిన కలెక్టర్, నిబంధనలు పాటించని ప్లాంట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ప్లాంట్ వద్ద నాణ్యత పరీక్షల షెడ్యూల్ను ప్రదర్శించాలని, అనుమతులు లేని ప్లాంట్లను ఉపేక్షించవద్దని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన నీరు అందించడమే లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు.










