ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం భిన్నంగా ఉంది. రాయలసీమలో ఎండలు మండిపోతుండగా, కోస్తాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రాయలసీమలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వర్షం పడే సమయంలో రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండరాదని హెచ్చరించారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆయన వివరించారు.










