మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైనిక్‌పురి ప్రాంతంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు గురువుగా, మార్గదర్శకుడిగా నిలిచిన మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు. పూలే ఆశయాలు, త్యాగాలు నేటి తరానికి మాత్రమే కాదు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
మహిళా విద్యకు తొలి పునాది వేసిన సావిత్రిబాయి పూలే సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళలకు చదువు ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి, అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ ఆడపిల్లలకు విద్యాబోధన చేసిన తొలి గురువుగా సావిత్రిబాయి నిలిచారని పేర్కొన్నారు.
మిలటరీ, స్పేస్, అడ్మినిస్ట్రేషన్ వంటి అన్ని రంగాల్లో మహిళలు ఎదుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో పార్లమెంట్, అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ల సాధనలో కూడా సావిత్రిబాయి వేసిన పునాది ఎంతో ప్రాముఖ్యత కలిగిందని అన్నారు. దేశహితం కోసం మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి ఇది దారితీస్తుందని తెలిపారు.
సుమారు 200 ఏళ్ల క్రితం పుట్టిన ఈ మహానుభావులు భారతదేశానికి వెలుగు, స్ఫూర్తి ప్రసాదించిన గొప్ప వ్యక్తులని, వారి ఆశయాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. యువత వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నేరెడ్మేట్ మాజీ కార్పొరేటర్ ఉపేందర్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్, వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, మౌలాలి మాజీ కార్పొరేటర్ సునీత యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి, గోపు రమణ రెడ్డి, సీనియర్ నాయకులు వి.కే. మహేష్, మౌలాలి డివిజన్ అధ్యక్షులు శివ, బుల్లెట్ స్వప్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju










