సికింద్రాబాద్.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ అవమానపరిచే విధంగా వ్యవహరిస్తుందని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో అల్వాల్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐసిసి కార్యదర్శి విష్ణునాథ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాయకులు హరి వర్ధన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, బండి రమేష్, పరమేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యవహరించే తీరును ఖండించారు. ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప సంపదగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భాజాప అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భారతదేశంలో ఏకం చేయడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. రాజ్యాంగం విషయంలో భాజాపా తీరు మారకుంటే భవిష్యత్తులో ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. మతతత్వ పార్టీగా భాజపా అనుసరిస్తున్న విధానాల మూలంగా దేశ సార్వభౌమత్వం దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగం పట్ల భాజపా చేస్తున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బి అర్ ఎస్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తించకుండా బి అర్ ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను దశలవారీగా అమలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్లు వెల్లడించారు.
హరి వర్ధన్ రెడ్డి.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు