హైదరాబాద్/ హైదరాబాద్.
ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మృతిపట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా, సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ… శిబూ సోరెన్ ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడిగా.., ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారన్నారు. ముఖ్యంగా ఆయన గిరిజన సంఘాల హక్కుల కోసం, ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ప్రసిద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసీ హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం భారతదేశ సామాజిక రాజకీయ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం నిరంతరంగా పోరాడిన ఆయన జీవితమే ఒక సందేశమని కొనియాడారు. దేశానికి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి గురూజీ మృతి తీరని లోటుగా పేర్కొన్నారు. శిబు సోరెన్ చూపిన మార్గం ఈనాటి తరాలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి సీతక్క తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
-సిద్దుమారోజు