సిద్దిపేట:జిల్లా/ ఎర్రవల్లి
ఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ (సోమవారం ఆగస్టు 4) నుంచి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో చండీ యాగం నిర్వహించనున్నారు. 15 మంది రుత్వికులతో మూడు రోజులపాటు యాగం చేయనున్నారు. సోమవారం పుత్ర ఏకాదశి కావడంతో ఈ యాగం ప్రారంభిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి అత్యంత నిష్టతో యాగం నిర్వహించనున్నారు. యాగం ప్రారంభం నుంచి ముగిసే వరకు కేసీఆర్ కటిక నేలపైనే నిద్రించనున్నట్లు సమాచారం. ఈ మూడు రోజులు కేసీఆర్ ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురు అవుతుండటంతో వాటన్నింటి నుంచి విముక్తి కల్పించాలని, అనుకూల పరిస్థితులు రావాలని చండీ యాగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్‌తో జగదీశ్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్నటి (ఆదివారం) నుంచి ఫాంహౌస్‌లోనే మాజీ మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. కాళేశ్వరం నివేదిక, ఈరోజు(సోమవారం) తెలంగాణ కేబినెట్ సమావేశం నేపథ్యంలో పార్టీ నేతలతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్ వ్యూహంపై కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు..
–సిద్దుమారోజు