ఆచంట, పెనుగొండ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులను పూర్తిగా మోసం చేశారని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆరోపించారు. పెనుగొండ ఏ.ఎం.సి (అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ) లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏ.ఎం.సి లకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్సీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసినా, ఆ పార్టీ నాయకులు ఇంకా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కూటమి నాయకులపై కన్నెత్తి చూస్తే వైఎస్సార్సీపీ కార్యకర్తలకు రోజు గడవడం కష్టం అవుతుందని హెచ్చరించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని నిస్సహాయ స్థితికి ఆ పార్టీ చేరిందని అన్నారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, భవిష్యత్తులో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో రైతులు 180 ట్రాక్టర్లతో ర్యాలీగా వచ్చి పాల్గొన్నారు. సమావేశం తర్వాత, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ.. పెనుగొండ ఏఎంసీ చైర్మన్గా బడేటి బ్రహ్మాజీ, వైస్ చైర్మన్లతో పాటు డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు