Thursday, August 21, 2025
spot_img
HomeBharat Aawazమీడియా మూగబోయిందా?

మీడియా మూగబోయిందా?

మీడియా అంటే ప్రజల గొంతు,  బాధను వినిపించే వేదిక,  ప్రశ్నించే ధైర్యం. సామాన్యుడి సమస్య నుంచి పేద, అణగారిన, అణచివేయబడిన వర్గాలకు అండగా నిలబడే శక్తి, దేశం కోసం పోరాడే వేదిక. 

స్వాతంత్ర్య పోరాటం నుంచి గ్లోబలైజేషన్ వరకు, ప్రతీ నిమిషం ప్రతీచోట ముందుండి నడిపించిన మీడియా, ఇప్పుడెందుకు మూగబోయింది? శీర్షికలు, వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా – ఇన్ని మార్పులు చెందుతూ వస్తున్న మీడియా, మార్పుతో పాటు తాను కూడా మారిపోయిందా? మాట్లాడాలని మరిచిపోయిందా?

రాజకీయ నాయకులు, ఆరోపణలు, ప్రతిపక్షాలు, అధికార పక్షాలు, సినిమాలు, ఇవేనా మీడియా అంటే? లేక కొత్తగా నేర్చుకున్న బూతు పురాణాలా? సినిమాలకి కాదు, A సర్టిఫికెట్ కొన్ని మీడియా ఛానెల్స్ కి ఇవ్వాల్సిన పరిస్థితి.

సమస్యలు ఏమున్నాయి, పరిష్కారం ఏంటి, ఎక్కడ అన్యాయం జరుగుతోంది, దీనిపైన పోరాడాలి, ఏది యువతకు, భవితకు, దేశానికి ముఖ్యం, ఏది నిజం, ఏది అబద్ధం – ఇలా అన్నీ చెప్పాల్సిన మీడియా, ధన, కుల, మత, వ్యాపార ఉద్దేశాలతో మూగబోయిందా?

మీడియా నిజం మాట్లాడుతుందా లేక? మీడియా మాట్లాడేది నిజమా? మరి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలా ఎందుకు చెబుతోంది? ఇలాంటి కొన్ని మారిపోయిన ఛానెల్స్ వల్ల, నిజంగా నిజం మాట్లాడే మీడియా ఛానెల్స్ మనుగడ కష్టం అయిపోయింది.

మీడియా స్వతంత్ర వ్యవస్థ. రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారస్తులు… ఇలా వేటితోటీ సంబంధం లేకుండా పత్రికా స్వేచ్ఛ, ప్రజల స్వేచ్ఛగా బతికే వ్యవస్థ. డెమోక్రసీలో ఒక్క మీడియాను తప్ప దేనిని 4వ పిల్లర్‌గా ఊహించలేం. అంత గొప్ప వ్యవస్థ, తనని తాను ఎలా మరిచిపోయింది, ఎందుకు మూగబోయింది?

రాజకీయ ఒత్తిళ్లకా, బెదిరింపులకా, స్వార్థం కోసమా? స్వేచ్ఛని తాకట్టు పెట్టే స్వార్థం అవసరమా? కోట్ల మంది ప్రతిబింబం మీడియా. వారి బాధకి, అన్యాయానికి, వేదనకి సాక్ష్యం మీడియా. తోడు నిలబడాల్సింది, వారి కోసం పోరాడాల్సింది మీడియా మాత్రమే. ఇది ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ.  దేశ భవితను నిర్ణయించగల వ్యవస్థ.

 

దీని మౌనం వెనుక, మిగతా వ్యవస్థలతో పాటు, ప్రజలు కూడా కారణమా? న్యాయానికి, నిజానికి ఆదరణ తగ్గుతోందా? పోరాడాల్సింది పోయి కాంప్రమైజ్ అవుతూ సాగిపోతున్నామా? ప్రజలుగా మనం మారదాం. మీడియా మౌనం వీడితే, కేవలం రిపోర్టింగ్‌ కాదు, మీడియా చేసే సపోర్ట్‌ని, సాధికారతని చూద్దాం. మౌనం వీడదాం.

 పాత్రికేయులంటే కేవలం వార్తలు రాసేవారు కాదు, గతంతో పోరాడుతూ భవిష్యత్తుకి బాటలు వేసేవాళ్లు. కలిసి నడుద్దాం. కలిసి ప్రశ్నిద్దాం. కలిసి గళం విప్పుదాం. మీడియా మన గళం, మన గాథ. మన ప్రశ్న, మన ఊపిరి. మౌనం వీడిన మీడియా, మన భవిష్యత్తు.

ధన, కుల, మత, రాగ, ద్వేషాల కోసం కాదు, వ్యాపారాల కోసమో, వ్యవహారాల కోసమో, టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసమో అసలే కాదు. ప్రజల కోసం, ప్రజల వాణిగా పోరాడుదాం. కలం గళం విప్పి స్వేచ్ఛా, సమానత్వాల కోసం, అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం.

జైహింద్!

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments