మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో ప్రాథమిక వసతులు లేకపోవడం, రోడ్ల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
పరిష్కారం కోసం చేసిన విజ్ఞప్తులు వృథా.
కాలనీవాసులు పలుమార్లు GHMC అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. TCS IQN డిజిటల్ జోన్ ఆనంద్ రావు ప్లాజా (పగల్ బలానగర్, పాత అల్వాల్ ప్రాంతం) దగ్గర రాకపోకలు మరింత కష్టతరం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ప్రజల వేదన..
కాలనీవాసులు మాట్లాడుతూ –”ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరిచిపోయారు.133 డివిజన్ పూర్తిగా నిర్లక్ష్యం పాలవుతోంది. రోడ్లు గుంతలతో నిండిపోయి వర్షాకాలంలో బురద మయంగా మారుతున్నాయి. ప్రతి వర్షం పడితే మా ఇళ్లు ముంపుకు గురవుతున్నాయి. మేము పదేపదే అధికారులకు సమస్యలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఇబ్బందులు..
ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చే విద్యార్థులు తమ సమస్యలను తెలియజేస్తూ –
“మా గ్రామాల్లో కూడా ఇలాంటి దుస్థితి చూడలేదు. పది నెలలుగా ఈ రహదారులపై ప్రయాణించడం ఒక శిక్షలా మారింది. మేము చదువుకునేందుకు ఇక్కడికి వస్తుంటే, బురదలో నడవడం చాలా ఇబ్బందిగా మారింది. GHMC అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి” అని కోరుతున్నారు.
నీటిమునిగిన రోడ్లు – మోటర్లతో తొలగించే నివాసులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ –
“ప్రతి వర్షం పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి. మేమే మోటర్లతో నీటిని రోడ్డుపై నుంచి తొలగించుకోవాలి. GHMC అధికారులు వస్తామని చెబుతారు కానీ ఎవరూ రారు. దాదాపు పది నెలల క్రితం తాగునీటి పైపుల కోసం తవ్విన రోడ్లు ఇప్పటికీ అలాగే వదిలేశారు. బురదలో మేము జీవనం గడపడం తప్ప మరో మార్గం లేదు” అని వాపోతున్నారు.
‘ప్రజల డిమాండ్”
ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఒకే స్వరంతో కోరుతున్నది –
GHMC వెంటనే రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలి.
తాగునీటి పైపుల పనులను పూర్తిచేయాలి.
డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.
వర్షాకాలం ముంపు సమస్యను దృష్టిలో పెట్టుకుని సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
తక్షణ చర్యలకై విజ్ఞప్తి.
ఫాదర్ బాలయ్య నగర్ కాలనీవాసులు, విద్యార్థులు, ఉద్యోగులు కోరుతున్నది ఒక్కటే – “మా సమస్యలు ఎప్పటి వరకు పక్కన పెట్టబడతాయి? GHMC అధికారులు తక్షణమే స్పందించి మా కాలనీ ఇబ్బందులను పరిష్కరించాలి. ఇలాంటి నిర్లక్ష్యం మేము ఇక భరించలేము” అని అన్నారు.
– sidhumaroju