సికింద్రాబాద్ : పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రసూల్ పురా నారాయణ జోపూడి లో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కర్ణన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తూ గత ప్రభుత్వం వదిలేసిన రెండు పడక గదులను సైతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. 288 మంది కుటుంబాలకు పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. కంటోన్మెంట్ లోని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే పేదలకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేదలకు ఇల్లు నిర్మించి మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కంటోన్మెంట్ ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు.
Sidhumaroju