గుజరాత్ రాష్ట్రంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా గుజరాత్ మంత్రిగా ప్రమాణం చేశారు. జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రివాబా, ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవిని స్వీకరించారు.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులంతా రాజీనామా చేయడంతో కొత్త క్యాబినెట్ ఏర్పాటైంది. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెకు ప్రమాణం చేయించారు.
రివాబా రాజకీయాల్లోకి రాకముందు కర్ణి సేనలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు రవీంద్ర జడేజా కూడా హాజరయ్యారు.