మొంథా తుపాను ప్రభావంతో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. వరద బాధితుల సహాయానికి చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.
SDRF బృందాలను తక్షణమే తరలించాలని, అవసరమైన పడవలు, హైడ్రా వద్ద ఉన్న సహాయక సామగ్రిని వినియోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి సూచించారు.
ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీటిని పంపించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించిన సీఎం, సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసిన సీఎం, గురువారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించారు.



