భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగానే ఘన స్వాగతం లభించింది. మహిళా వన్డే వరల్డ్ కప్లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించి విశ్వవిజేతగా నిలిచిన శ్రీచరణి విజయంతో తెలుగు రాష్ట్రాలు గర్వపడుతున్నాయి.
ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, అలాగే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పూలమాలలతో ఘనసత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, శాప్ అధికారులు కూడా పాల్గొన్నారు.
మంత్రులు మాట్లాడుతూ, శ్రీచరణి ప్రతిభ దేశానికి గౌరవం తెచ్చిందని, ఆమె విజయంతో యువతకు ప్రేరణ లభిస్తుందని తెలిపారు. శ్రీచరణి తన విజయానికి కుటుంబం, కోచ్లు, అభిమానుల మద్దతే కారణమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలతో భారత క్రికెట్ రంగంలో తన కీర్తిని నిలబెట్టుకోవాలని సంకల్పించారు. స్వాగత కార్యక్రమం అనంతరం శ్రీచరణి గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరారు.




