మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1976లో స్థాపించబడిన లొయోలా అకాడమీ తరువాత, తన 49 ఏళ్ల విశిష్ట ప్రస్థానంలో విద్యార్థుల విజయాలు, జ్ఞాపకాలను ప్రేమగా పదిలపరచుకుంటూ ముందుకు సాగుతోంది. పూర్వ విద్యార్థులు తమ ప్రయాణాన్ని స్మరించుకుంటూ, ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి వచ్చిన పూర్వవిద్యార్థులు తమ కళాశాలను తిరిగి సందర్శించడంతో కళాశాల ఆవరణ పాత జ్ఞాపకాలతో మునిగిపోయింది. దశాబ్దాల క్రితం విద్యాభ్యసం పూర్తి చేసినవారు, ఇటీవలే బయటికి వెళ్లినవారితో కలసి పంచుకున్న స్మృతులు, అనుబంధాలు, స్నేహభావంతో ఈ కార్యక్రమం మరింత ఆహ్లాదకరంగా మారింది.
వైస్ చైర్మన్ & రెక్టర్ ఫాదర్ సిహెచ్. అమరరావు, SJ పూర్వవిద్యార్థులను ఆత్మీయంగా స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ, ఈ సమ్మేళనం సాధారణ సమావేశం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని సాధించిన లొయోలా పూర్వవిద్యార్థుల విజయాలను స్మరించడానికి, అభినందించడానికి ఒక అద్భుత వేదిక అని తెలిపారు.
కరస్పాండెంట్ ఫాదర్ డాక్టర్. ఏ. ఫ్రాన్సిస్ జేవియర్, SJ సంవత్సరాలుగా విద్యార్థులతో పంచుకున్న ప్రయాణాన్ని గర్వంగా గుర్తుచేసుకున్నారు. ప్రిన్సిపల్ ఫాదర్. డాక్టర్. ఎన్. బి. బాబు, SJ , లొయోలా అకాడమీ ఈరోజు పొందిన ప్రతిష్ట, స్థానానికి పూర్వవిద్యార్థుల సేవలు, విలువలు, ప్రతిభలే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా హాజరైన డా. సత్యనారాయణ వి. నండూరి , చైర్మన్ మరియు మెంబర్ ప్రసిద్ధ పరిశోధన మరియు అభివృద్ధి కన్సల్టెంట్, మాజీ చీఫ్ సైంటిస్ట్, CSIR–IICT హైదరాబాద్ (GITAM, ASCI మరియు AcSIR లో విశిష్టమైన శాస్త్రీయ మరియు పరిపాలనా భూమికల్లో సేవలందించినవారు తన విద్యార్థి దశ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, తనను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనను కళాశాల ఈ గౌరవ స్థాయిలో తిరిగి ఆహ్వానించడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
లొయోలా పూర్వ విద్యార్ధి సంఘ అధ్యక్షులు మరియదాస్ పూదోట, లొయోలా జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్ధి సంఘ అధ్యక్షులు కౌశిక్ కాతూరి మరియు అసోసియేషన్ కార్యదర్శి మానిక్య రెడ్డి తమ అనుభవాలను పంచుకుంటూ, అకాడమీతో ఉన్న చిరస్థాయి అనుబంధాన్ని ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ప్రముఖ పూర్వవిద్యార్థులు సుధీర్ సూరసాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్; లక్కరాజు ఫణి ప్రకాశ్, డైరెక్టర్ – సొల్యూషన్స్ అండ్ సేల్స్, బారేజ్ టెక్నాలజీ సొల్యూషన్స్, దుబాయ్; మరియు డా. టీ. చక్రధర్, ప్రోగ్రామ్ పాలసీ ఆఫీసర్, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్రికల్చర్ 1994-97 బ్యాచ్ పూర్వ విద్యార్ధులు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించి కళాశాల యూజమాన్యానికి చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్ధుల సాంస్కృతిక కార్యక్రమాలు పూర్వ విద్యార్దులను ఆకట్టుకున్నాయి. పూర్వ విద్యార్ధులు తమ కళాశాల స్నేహితులను కలుసుకుని ఆనందంగా కళాశాల ప్రాంగణంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సమావేశం పాత జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకునేలా చేసింది. లొయోలా అకాడమీ తో తమ పూర్వవిద్యార్థుల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్ధులతో పాటు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ విజయ్ కుమార్ రెడ్డి, డిగ్రీ మరియు పిజి కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఫాదర్స్ డా. ఎ.ఎమ్. జోసెఫ్, ఫాదర్ అరుల్ జోతి, ఫాదర్ పీటర్, ఫాదర్ తైనీస్, ఫాదర్ డా. తోమాస్ కళాశాల ఉపాధ్యాయులు, స్టూడెంట్ కౌన్సిల్ విద్యార్ధులు పాల్గొన్నారు.
Sidhumaroju




