జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. “ఇంటరాక్షన్” పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్లను అమ్మాయిల వేషధారణలో డాన్స్ చేయించడంతో పాటు మానసిక వేధింపులకు గురి చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ల బెదిరింపులతో జూనియర్ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. యాంటీ ర్యాగింగ్, ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీలు పేరుకే ఉన్నాయని, పర్యవేక్షణ సరిగ్గా లేదని ఆరోపించారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను, కళాశాల అధికారులను కోరుతున్నారు. ప్రిన్సిపాల్ స్పందిస్తూ ఘటనపై విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. నిపుణులు విద్యార్థులు ఇలాంటి సంఘటనలను తేలికగా తీసుకోకుండా, వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు.



