*ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో హోమ్‌స్టేల అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు*
*కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడి*
*హోమ్ స్టేల అభివృద్ధి పై పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖను ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్*
ఢిల్లీ : దేశవ్యాప్తంగా “గిరిజన ప్రాంతాల్లో హోమ్‌స్టేల అభివృద్ధి” పథకం కింద 17 రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి హోమ్‌స్టేల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు అందాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్ మరియు లడఖ్ నుంచి వచ్చిన మొత్తం 5 ప్రతిపాదనలకు రూ.17.52 కోట్ల వ్యయంతో ఆమోదం లభించినప్పటికి నిధులు మాత్రం విడుదల కాలేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడించారు.
లోక్ సభలో సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్ హోమ్‌స్టేల అభివృద్ధి పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా, ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ లిఖిత పూర్వకంగా బదులిచ్చారు.
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రధానమంత్రి జనజాతీయ ఉన్మత్త గ్రామ అభియాన్ (PM-JUGA) కింద, స్వదేశ్ దర్శన్ పథకానికి అనుబంద పథకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అవకాశాలను పెంపొందించి, గిరిజన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ “గిరిజన ప్రాంతాల్లో హోమ్‌స్టేల అభివృద్ధి” పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ పథకం కింద గ్రామ సముదాయ అవసరాలకు రూ.5 లక్షల వరకు, పత్రి కుటుంబానికి రెండు కొత్త గదుల నిర్మాణానికి రూ.5 లక్షల వరకు, గదుల పునరుద్ధరణకు రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించటం జరుగుతుందని స్పష్టం చేశారు.
అయితే, ఈ పథకం కింద ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి కూడా నిధులు విడుదల కాలేదని, అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయిలో గానీ, జిల్లా స్థాయిలో గానీ నిధుల వినియోగం జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా వారీగా హోమ్‌స్టేల సంఖ్య లేదా నిధుల కేటాయింపు వివరాలు ఇంకా ప్రకటించలేదని పేర్కొన్నారు.
