వామపక్ష పార్టీలు
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 18 డిసెంబర్, 2025.
ఉపాధిహామీ పథకంలో మార్పులను వ్యతిరేకిస్తూ
22న రాష్ట్రవ్యాపిత నిరసనలకు వామపక్షాల పిలుపు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాపితంగా ఈనెల 22న 10 వామపక్ష పార్టీలు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చాయి. చట్టబద్ద హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
యుపిఎ ప్రభుత్వంపై ఆనాడు వామపక్షాలు తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగా రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టం మౌళిక స్వభావం కేంద్ర ప్రభుత్వం మారుస్తున్నది. వికసిత్ భారత్ ` గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (విబి-జి రాం జి) పేరుతో ఉపాధిహామీ పథకానికి ‘‘రాంరాం’’ పలకనున్నది. పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి ఇదొక సాధారణ పథకంగా అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికులకు డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే విధానాన్ని మార్చివేసి అవసరాన్ని (సప్లయిని) బట్టి పనులు పెట్టడం అంటే ఈ పథకం మౌలిక స్వభావాన్ని నిర్వీర్యం చేయడమే. పనిదినాలు 100 నుండి 125 రోజులకు పెంచనున్నట్లు చెప్పడం ప్రజలను మభ్యపెట్టేందుకే. ఉపాధి కార్డులను హేతుబద్దీకరిస్తున్నామన్న పేరుతో పెద్ద సంఖ్యలో గ్రామీణ కుటుంబాలను
మినహాయిస్తున్నారు. ఇప్పటికే యంత్రాలు కేటాయించి కూలీల డిమాండ్ తగ్గించారు. వ్యవసాయ పనులు రద్దీగా ఉండే సమయాలలో 60 రోజుల ఉపాధిని నిలుపుదల చేయడం వలన అత్యంత అవసరమైన సమయాలలో గ్రామీణ కార్మికులకు పని నిరాకరించబడుతుంది. తద్వారా వారిని భూస్వాములపై ఆధారపడేలా చేయడం గర్హనీయం. యంజిఎన్‌ఆర్‌ఈజిఎగా ఉన్న ఈ పథకం పేరును మార్చడం మహాత్ముడిని అవమానించడమే.
ఉపాధి హామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారుతుంది. మరోవైపు 10 నుండి 40 శాతానికి రాష్ట్రాలపై భారం పెంచారు. ఈ పథకం అమలుకు ఇప్పటి వరకు కేంద్రం ఇస్తున్న 90% నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారు. మన రాష్ట్రంపై ఏటా సుమారు నాలుగు వేలకోట్లు అదనపు భారం పడనుంది. మోడీ ప్రభుత్వానికి కీలక మద్దతుగా వున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కొత్త ఉపాధి బిల్లును ఉపసంహరించుకునేటట్లు కేంద్రంపై ఒత్తిడి తేవాలని వామపక్షాలు కోరుతున్నాయి.
డిసెంబర్ 22న జిల్లా కేంద్రాలలో వామపక్షాలు పిలుపిచ్చిన ఈ నిరసనల్లో కార్యకర్తలు, ప్రజలు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వామపక్ష పార్టీలు కోరుతున్నాయి.
(వి.శ్రీనివాసరావు)
సిపిఐ(యం)
(జి.ఈశ్వరయ్య)
సిపిఐ
(పి.ప్రసాద్)
సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ
(జాస్తి కిషోర్‌బాబు)
సిపిఐ(యంఎల్)
(కాటం నాగభూషణం)
యంసిపిఐ(యు)
(బి.బంగార్రావు)
సిపిఐ(యంఎల్) లిబరేషన్
(యం.రామకృష్ణ)
సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ
(బి.ఎస్. అమర్‌నాథ్)
యస్‌యుసిఐ(సి)
(పి.వి.సుందరరామరాజు)
ఫార్వర్డ్‌బ్లాక్
(జానకి రాములు)
రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ
