2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసింది సీఎం చంద్రబాబు అని, విద్యుత్ ఛార్జీల భారం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ సోలార్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
బందర్ రోడ్డు లోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సోలార్ రీనబుల్ ఎనర్జీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ , నెడ్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబుతో కలిసి ప్రారంభించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 50 సోలార్ ఎనర్జీ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ప్రతి స్టాల్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించి సోలార్ ఎనర్జీ ఏవిధంగా పనిచేస్తుంది వాటి ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 1995 వ సంవత్సరంలో సీఎం చంద్రబాబు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు చేసిన సంస్కరణలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
2029 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిపై సోలార్‌ను ఏర్పాటు చేసేవి దిశగా ప్రభుత్వం అడుగు వేస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సబ్సిడీలు ఇస్తోందని వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై సోలార్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపకుండా సోలార్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని వివరించారు.
అనంతరం నెడ్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ పెరుగుతోందని, రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తోందని తెలిపారు. విద్యుత్తు డిమాండ్ దృష్ట్యా ప్రజలందరూ తమ ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకోవాలని తద్వారా విద్యుత్తు డిమాండ్ తగ్గడంతో పాటు విద్యుత్తు చార్జీల భారం కూడా తగ్గుతుందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసే విధంగా నెడ్ క్యాప్ అనేక చర్యలు చేపడుతోందని వివరించారు. సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీ ల వలన రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని రైతాంగానికి సోలార్ ఎనర్జీ ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి మోటార్‌కు సోలార్ ఏర్పాటు చేసే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోలార్ ఎనర్జీ వాడటం వలన కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు పూర్తిస్థాయిలో సబ్సిడీ అందజేస్తున్నామని, బీసీలకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షులు హేమ కుమార్ మాట్లాడుతూ సోలార్ ఎనర్జీ ప్రదర్శన 19,29,21 తేదీల్లో జరుగుతుందని చెప్పారు. అదాని, వారీ ,రెన్యూ ,ఫెహెల్ ,రిలయన్స్ ,గౌతమ్, తదితరుసోలార్ కు చెందిన ప్రముఖ కంపెనీలు ప్రదర్శనలో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రధానమంత్రి సూర్య గర్ యోజన పథకం కింద సోలార్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి 50 గ్రాముల వెండి కాయిన్ ఉచితంగా అందజేస్తున్నామని, ఐదు సంవత్సరాల ఉచిత సర్వీస్ కూడా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తేజ ఉపాధ్యక్షులు నాగరాజు కోశాధికారి జయ బాబు, సభ్యులు చందు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.|




