ఈరోజు (20 డిసెంబర్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. – జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ఉపాధి హామీపై దేశవ్యాప్త ఉద్యమం
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
రాయలసీమలో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సిటీ నిర్మించాలి
కార్పొరేట్ల కోసమే పరిశ్రమలు తప్ప ప్రజల కోసం కాదు
మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలి.
కొత్త ఉపాధి పథకానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ వ్రాయాలి : వి.శ్రీనివాసరావు
వైసిపి, టిడిపి ప్రజలపక్షమో, మోడీపక్షమో తేల్చుకోవాలి
గంజాయిపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
అమరావతికి రెండోదశ భూసమీకరణ అవసరం లేదు.
కొత్తగా తీసుకొచ్చిన జీరాంజీ బిల్లు వల్ల పేదలకు ఎటువంటి ఉపయోగమూ లేదని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని కొనసాగించాలని, దీనికోసం దేశవ్యాప్త ఆందోళన చేపడతామని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
గతంలో ఉన్న ఉపాధిహామీ చట్టాన్ని రద్దుచేసి కొత్తగా జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారని, దీనిలో కార్మికులకుగానీ, రాష్ట్రాలకుగానీ ఎటువంటి హక్కులూ లేవని, ఉన్నవి కూడా పాక్షికంగానే ఉన్నాయని తెలిపారు. గతంలో కనీసం 100 రోజులు పని పేరుతో 50 రోజులన్నా కార్మికులకు ఉపాధి లభించేదని, ఇప్పుడు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఉండేలా చేశారని తెలిపారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయ పనులకు ఆటంకమని చెబుతున్నారని, అలాంటిదేమీ లేదని అనేక నివేదికలు, పరిశోధనలు బయటపెట్టాయని తెలిపారు. కూలీరేట్లు పెరిగాయని చెబుతున్నారని, ఆచరణలో కూలీరేట్లు, వేతనాలు తగ్గాయని పేర్కొన్నారు.
గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికుల శ్రమను కార్పొరేట్లు దోచుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని విమర్శించారు. పథకంలో నిధుల వాటా గతంలో కేంద్రానికి 90 శాతం రాష్ట్రానికి 10 శాతం వాటా ఉండేదని, ప్రస్తుతం 60:40గా మార్చారని తెలిపారు. ఆకలిచావులు, వలసలు నివారించేందుకు ఉపయోగపడిన ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల మరలా ఆకలిచావులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
పైగా దీనికి నిధుల కేటాయింపు డిమాండును బట్టి కాకుండా రాజకీయ అవసరాలకు తగిన విధంగా కేటాయించేలా నిబంధనలు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేంద్రం ముందుగానే నిధులు ఇచ్చేదని, ఇప్పుడు పనిచేసిన తరువాత బిల్లు ఇచ్చేలా పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఉపాధి కల్పనలో ఆలస్యమయితే గతంలో కేంద్రమే పెనాల్టీ చెల్లించేదని, ఇప్పుడు ఆ బాధ్యతను రాష్ట్రం మీదకు నెట్టేశారని పేర్కొన్నారు.
దీనిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి మాట్లాడటం లేదని, ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కూడా గట్టిగా ప్రశ్నించడం లేదని అన్నారు. సెలక్టు కమిటీకి పంపించాలని చెప్పి వైసిపి చేతులు ముడుచుకు కూర్చుందన్నారు. రెండు పార్టీలూ మోడీని చూసి భయపడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు మోడీతో అనుసరిస్తున్న తీరువల్ల రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని అన్నారు.
రాయలసీమకు వీలుగా పారిశ్రామిక పాలసీ మార్చాలి .
రాయలసీమ ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్`ఎలక్ట్రానిక్స్ సిటీ నిర్మించాలని, అక్కడ పరిశ్రమలకు అనువైన వాతావరణం కూడా ఉందని తెలిపారు. బెంగుళూరులో ఐటి అభివృద్ధి చెందింది కూడా అందువల్లేనని తెలిపారు. రాయలసీమను హర్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతానని, 41వేల కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఢల్లీిలో నిధుల కోసం అడుగుతున్న ముఖ్యమంత్రి సీమలో పరిశ్రమల ఏర్పాటుపైనా దృష్టి సారించాలని సూచించారు. కావాల్సినంత విండ్, సోలార్ ఎనర్జీ ప్లాంటు ఉన్నాయని, ఇక్కడ విద్యుత్‌ను ఎక్కడికో తరలించే బదులు పరిశ్రమలు ఇక్కడే ఏర్పాటు చేస్తే వాటికి ఉపయోగించుకోవచ్చని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అవసరం ఉన్న చోట పరిశ్రమలు పెట్టాలని, కానీ ప్రభుత్వం కార్పొరేట్లు కోరినచోట భూములు ఇస్తోందని అన్నారు.
ఇప్పటి వరకూ ఉన్న హార్టీకల్చర్‌ను కూడా రైతులే అభివృద్ధి చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, వలసలు తగ్గుతాయని తెలిపారు. ఇండస్ట్రియల్ పాలసీలో రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎక్కువమంది ఆ ప్రాంతం వారేనని, రాష్ట్రం విడిపోయిన తరువాత ఉన్న ముఖ్యమంత్రులిద్దరూ ఆ ప్రాంతంవారేనని, కానీ అక్కడ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని తెలిపారు.
వైద్యకళాశాలల పూర్తి ప్రైవేటీకరణ
మెడికల్ కళాశాలల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మరింత ప్రమాదకరమని రాఘవులు తెలిపారు. ఖర్చంతా ప్రభుత్వం వెచ్చించి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని, నిర్వహణ కూడా ప్రభుత్వమే చేపడుతుందని చెప్పడం మరింత నష్టమని తెలిపారు. సిఎం, మంత్రులు వైద్యకళాశాలలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని పదేపదే చెబుతున్నారని, అలాంటప్పుడు ప్రభుత్వమే నిర్వహించవచ్చని, ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. వైద్యం, విద్య ప్రజల హక్కుగా ఉండాలని, పిపిపి వల్ల అటువంటి హక్కులు కోల్పోతారని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి వైద్యకళాశాలల పూర్తి ప్రైవేటీకరణకు మొదటి మెట్టని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
రాష్ట్రంలో గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిందని, దీనికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం దాన్ని ఆచరణలో పెట్టడం లేదని తెలిపారు. పైగా ఎవరైనా ఫిర్యాదులు చేస్తే గంజాయివాళ్లతో మీకెందుకంటూ బెదిరించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
నెల్లూరులో పెంచలయ్య హత్య గంజాయి వ్యాపారానికి పరాకాష్టని అన్నారు. రాష్ట్రానికి యువత వనరని చంద్రబాబు పదేపదే చెబుతున్నారని, అటువంటి యువతను గంజాయి కబళిస్తోందని, అయినా నివారణకు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలకు నిజాయితీ కనిపించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిపై ఆందోళన చేపడతామని అన్నారు. ఆసక్తి ఉన్న, పార్టీలు ఉద్యమంలో కలిసి ముందుకు రావాలని కోరారు.
జీరాంజీతో దళితులు, బలహీనవర్గాలకు తీవ్రనష్టం .
ఉపాధిహామీ చట్టం స్థానంలో జీరాంజీ పథకం తీసుకురావడం సరికాదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు, పేదలు, గ్రామీణ కూలీలు ఎక్కువమంది ఉన్నారని, కొత్త పథకం వల్ల వారందరికీ ఉపాధి పోతుందని తెలిపారు. రాయలసీమలోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గతంలో ఆకలిచావులు ఉండేవని, ఉపాధిహామీ వల్ల తగ్గాయని తెలిపారు.
ప్రస్తుతం 50 రోజులు దొరుకుతున్న పనికి గ్యారంటీ లేకుండా పోతుందని పేర్కొన్నారు. నూతన నిబంధనల వల్ల రాష్ట్రంపై రూ.3000 కోట్ల భారం పడుతుందని వివరించారు. అయినా టిడిపి, వైసిపి నాయకులు నోరెత్తడం లేదని విమర్శించారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయడంతోపాటు, రాష్ట్రం నుండి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు. దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు 22వ తేదీన ఆందోళనకు పిలుపునిచ్చాయని, దీనిలో అన్ని సంఘాలూ కలిసి రావాలని కోరారు.
రెండోదశ భూసమీకరణ అనవసరం .
అమరావతిలో గతంలో భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, వారి ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో కూడా చూపించలేదని, ఇటువంటి సమయంలో రెండోదశ భూ సమీకరణ అనవసరమని శ్రీనివాసరావు తెలిపారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువ ఆనందపడిరది అమరావతి రైతులని, ఇప్పుడు వారే ఎక్కువ బాధపడుతున్నారని, ప్రస్తుతం వారి పరిస్థితి త్రిశంకుస్వర్గంలో ఉందని పేర్కొన్నారు.
తాము 30 ఏళ్లు అధికారంలో ఉంటామని పదేపదే సిఎం చెబుతున్నారని, ఈ ఐదేళ్లలోనే అమరావతిలో అభివృద్ధి చేసి, రైతులకు నమ్మకం కలిగించాలని తెలిపారు. పైగా నిర్మాణాల పేరుతో అప్పులు తెచ్చి ప్రజలనెత్తిన రుద్దుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి అమరావతి రాజధానిలో ప్రస్తుతం ఉన్న భూమిని అభివృద్ధి చేయాలని, రెండోదశ సమీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు.
