గుంటూరు, కేఎల్ యూనివర్సిటీ || 20-12-2025
వివేకానంద ఆశయాలతో యువత ముందుకు సాగాలి.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
యువజన ఉత్సవాల ముగింపులో బహుమతుల ప్రదానం చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖల మంత్రి
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ‘యువ కార్యక్రమం’ యువతకు గొప్ప స్ఫూర్తిని అందించిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలోని ఆర్&డి ఆడిటోరియంలో నిర్వహించిన యువజన ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్ర యువ సంకల్ప్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన యువతకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదేనని అన్నారు.
స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఇవి ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరంగా కొనసాగాలని సూచించారు. యువత తమ చేతుల్లో ఉన్న భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకుంటూ, మంచి పనులు చేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు.
రానున్న రోజుల్లో యువత నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో రాజధాని లేక రాష్ట్రం ఎంతో బాధను అనుభవించిందని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణాన్ని చేపట్టి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు.
గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభివృద్ధికి నిదర్శనమని, రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగనుందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రానికి కంపెనీల రాకతో ఆ లక్ష్యాన్ని తప్పక సాకారం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఎస్. భరణి, కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ సాయి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
