Home South Zone Andhra Pradesh జిల్లా కలెక్టర్ పర్యావరణ రక్షణ పిలుపు – నిజంగా ప్రజలు చేరతారా|

జిల్లా కలెక్టర్ పర్యావరణ రక్షణ పిలుపు – నిజంగా ప్రజలు చేరతారా|

0

మచిలీపట్నం డిసెంబర్ : ———

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా పాటించి, ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.

శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు కార్యాలయపు సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాలు, ఎండిపోయిన ఆకులను, విరిగిపోయి పడిపోయిన చెట్టు కొమ్మలను తొలగించి మునిసిపల్ ట్రాక్టర్లకు ఎక్కించారు.

ప్రతి శనివారం మాదిరిగానే ఈసారి కూడా జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి సిబ్బందితో కలిసి కలెక్టరేట్కు సైకిల్ పై వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. వారిని ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది కూడా సైకిల్ పై రావడం చెప్పుకోదగ్గ విశేషం.

ఈసారి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ట్రాక్టర్ ని నడిపి అందరిని ఆశ్చర్య చకితులను చేశారు.

కలెక్టరేట్ లో ఎటువంటి మోటారు వాహనాలను అనుమతించకపోవడంతో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది అందరూ కాలినడకన గాని, సైకిల్ పై గాని కార్యాలయం లోపలికి రావడం జరిగింది.

నగరాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న మునిసిపల్ పారిశుధ్య సిబ్బందిని అధికారులు కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది అందరూ అభినందించారు.
అనంతరం డిఆర్ఓ అందరి చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 10 సూత్రాలలో భాగంగా ఆరోగ్య సూత్రమైన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు.

ప్రతినెల 3 వ శనివారం పెద్ద స్థాయిలో అందరము స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

కలెక్టరేట్లో ప్రతి శనివారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు అందరితో కలిసి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చేస్తున్నామన్నారు.

ఈ నెల పర్యావరణ రంగంలో అవకాశాలు అనే ఇతివృత్తంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు.

మన పరిసరాల లో ఉన్న అవకాశాలను వాడుకుంటూ దాన్నుంచి పర్యావరణాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశం అన్నారు.

జిల్లా డెల్టా ప్రాంతం అయినందున గుర్రపు డెక్క చాలా ఎక్కువగా ఉందన్నారు.
ఇదివరకే సర్కులర్ క్లస్టర్ ఎకానమీలో భాగంగా గుర్రపుడెక్కతో వివిధ రకాల అల్లికలతో చాలా అందమైన ఆకృతులను తయారు చేయడానికి స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చామన్నారు.
అది విజయవంతంగా నడుస్తోందన్నారు.
దాన్ని ఇటీవల జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ప్రదర్శనకు ఉంచగా సరఫరా చేయమని పెద్ద ఎత్తున ఉత్తర్వులు వచ్చాయన్నారు.

ఒకవైపు గ్రామీణ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం, మరొకవైపు చెత్త నుంచి సంపదను సృష్టించడం చేస్తున్నామన్నారు. చెత్త యాజమాన్యం నిర్వహణ సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయన్నారు.

జిల్లాలో జెడ్ బి ఎన్ ఎఫ్ పేరుతో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ కింద ప్రకృతి వ్యవసాయం వైపు పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు

అంతేకాకుండా పాఠశాల విద్యార్థుల స్థాయి నుంచి వారిలో అవగాహన వస్తే భవిష్యత్తులో రసాయన వ్యవసాయం కాకుండా ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా వారి తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తారన్నారు.

జిల్లాలో 106 పాఠశాలల్లో పెరటి తోటలు (కిచెన్ గార్డెన్స్) పెంపక కార్యక్రమం చేపట్టామన్నారు.

ఇలా జిల్లాలో అనేక కార్యక్రమాలను పర్యావరణ హితం కోసం చేస్తున్నామన్నారు.
ఇంధనం పొదుపులో భాగంగా పిఎం సూర్యాఘర్ పథకం అమలులో రాష్ట్రంలోనే మన జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. దాన్ని ఇంకనూ మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇది ఒక నిరంతర ప్రక్రియ అని ఒక రోజు రెండు రోజులది కాదని అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు కొనసాగుతుందన్నారు.

ప్లాస్టిక్ నివారణలో భాగంగా కలెక్టరేట్లో ప్లాస్టిక్ సీసాల వాడకాన్ని నిషేధించామన్నారు

ఇందుకోసం కలెక్టరేట్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ స్టీలు సీసాలను అందజేశామన్నారు.

మరో అడుగు ముందుకు వేసి కలెక్టరేట్లో గాజు సీసాల ద్వారా స్వచ్ఛమైన నీరు అందించే ఒక ప్లాంట్ ను త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఆ ప్లాంట్ ద్వారా గాజు నీటి సీసాలలో స్వచ్ఛమైన నీటిని నింపి కలెక్టరేట్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. మరలా వాటిని సేకరించి శుభ్రం చేసి తిరిగి శుద్ధ జలాన్ని అందరికీ అందజేయడం జరుగుతుందన్నారు.
రానున్న రోజుల్లో కలెక్టరేట్లోకి ఎక్కడ కూడా ఒక్క ప్లాస్టిక్ సీసా కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు,జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, వయోజన విద్య ఏడి బేగ్, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనందకుమార్, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు,
బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర కుమార్, సమాచార శాఖ డిడి యమ్. వెంకటేశ్వర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి ,జిల్లా ఖజానా అధికారి రవికుమార్,
కలెక్టరేట్ ఏవో రాధిక, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది మున్సిపల్ కార్యాలయ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కృష్ణా జిల్లా మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది

NO COMMENTS

Exit mobile version