Home South Zone Telangana 63 ఏళ్ల వృద్ధుడిపై కుటుంబ బాధ్యత దుర్వినియోగం |

63 ఏళ్ల వృద్ధుడిపై కుటుంబ బాధ్యత దుర్వినియోగం |

0

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకున్న అనుమానాస్పద మృతి కేసు వెనుక భయానక కుట్రను పోలీసులు బయటపెట్టారు. గాదె అంజయ్య హత్యకు తండ్రి లచ్చయ్య, భార్య శిరీషలే సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. పూర్తి వివరాలు కథనం లోపల …

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య (36) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో తండ్రి, భార్యే సుపారీ ఇచ్చి అంజయ్యను హత్య చేయించినట్లు విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీపూర్ నివాసి గాదె లచ్చయ్య (63) తన కోడలు శిరీషతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. 2017లో ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన అంజయ్య, 2019లో తిరిగి వచ్చిన తర్వాత తండ్రి, భార్యల మధ్య ఉన్న సంబంధాన్ని గమనించి వారిని మందలించాడు. దీనితో తమ సాన్నిహిత్యానికి అడ్డుగా ఉన్న అంజయ్యను వదిలించుకోవాలని తండ్రి, భార్య పథకం వేశారు.

నేరుగా చంపితే అనుమానం వస్తుందని భావించిన లచ్చయ్య, అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి సహాయంతో సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించాడు. రవి తన బంధువైన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని స్నేహితుడు మహమ్మద్ అబ్రార్‌లకు అంజయ్యను చంపేందుకు రూ. 3 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంజయ్యతో స్నేహం పెంచుకున్న కోటేశ్వర్, అబ్రార్‌లు గత కొన్ని రోజులుగా అతనితో కలిసి మద్యం సేవించేవారు.

ఈ నెల 02వ తేదీన మద్యం తాగుదామని అంజయ్యను ఊరి చివర కెనాల్ సమీపంలోకి పిలిచారు. అక్కడ అతనికి అమితంగా మద్యం తాగించి, మత్తులోకి జారుకున్న తర్వాత కోటేశ్వర్ గొంతు నులమగా, అబ్రార్ చేతులు పట్టుకుని అంజయ్యను హతమార్చారు. నిందితుడు రవి దగ్గరుండి ఈ విషయాన్ని లచ్చయ్యకు చేరవేశాడు. సాక్ష్యాలను మరుగుపరచడానికి చీకటి పడిన తర్వాత మృతదేహాన్ని D-8 కెనాల్‌లోకి తోసేశారు.

కాలువలో శవం దొరకడంతో, ప్రమాదవశాత్తు పడి చనిపోయాడని నమ్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే, పోలీసుల లోతైన విచారణలో లచ్చయ్య, శిరీషల ప్రవర్తనపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. నిందితులైన ​గాదె లచ్చయ్య (మృతుడి తండ్రి), ​గాదె శిరీష (మృతుడి భార్య), ఉప్పరపల్లి కోటేశ్వర్ (సుపారీ హంతకుడు), మహమ్మద్ అబ్రార్ (సుపారీ హంతకుడు),  కొలిపాక రవి (మధ్యవర్తి)లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

#Sivanagendra

NO COMMENTS

Exit mobile version