ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 25, 2025*
ఆంధ్రా ట్యాక్సీలో హాయిహాయిగా విహరిద్దాం..
– పర్యాటకులకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి
– అందుబాటు ధరల్లో సురక్షితమైన, సంతోషకరమైన విహారయాత్ర సేవలు
– పర్యాటకంలో జిల్లాను నెం.1గా నిలిపేందుకు ప్రత్యేక చొరవ
– ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా టీమ్ ఎన్‌టీర్ కృషి*
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తి అయిన సేవారంగంలో కీలకమైన పర్యాటకంలో ఎన్‌టీఆర్ జిల్లాను నెం.1గా నిలిపేందుకు భాగస్వామ్య పక్షాలతో కలిసి టీమ్ ఎన్‌టీఆర్ కృషిచేయడం జరుగుతోందని.. ఈ క్రమంలో కొత్తగా ఆంధ్రా ట్యాక్సీ పేరుతో ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఎన్‌టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో రూపొందించిన ఆంధ్రా ట్యాక్సీ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. ట్యాక్సీ, ఆటో యూనియన్ల ప్రతినిధులు, డ్రైవర్లు, పర్యాటక, రవాణా శాఖ అధికారులు తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి విశేష కృషిచేస్తోందని..
జిల్లాలో ఆధ్యాత్మిక, పర్యావరణ, చారిత్రక పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని.. ఈ నేపథ్యంలో పర్యాటకులకు అందుబాటు ధరల్లో సురక్షితమైన, సంతోషకరమైన విహారయాత్ర సేవలను ఈ ప్రత్యేక యాప్ ద్వారా అందించేందుకు కృషిచేస్తున్నామన్నారు. సౌకర్యవంతమైన ప్రయాణానికి సరైన ఎంపిక ఆంధ్రా ట్యాక్సీ అని.. ఇందులో ఎన్‌టీఆర్ టూరిజం వివరాలు, వ్యవసాయ డ్రోన్ సేవలు, రవాణా సేవలు, సమీప పోలీస్ స్టేషన్‌కు అనుసంధానమైన ఎస్‌వోఎస్ సేవలు తదితరాలు అందాబాటులో ఉంటాయన్నారు.
మొబైల్ యాప్‌తో పాటు క్యూఆర్ కోడ్, వాట్సాప్, వెబ్‌సైట్ ద్వారా కూడా ఆటో, ట్యాక్సీ తదితర సేవలను బుకింగ్ చేసుకునే వీలుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
*అందుబాటులో టూరిజం ప్యాకేజీలు:
ఎన్‌టీఆర్ జిల్లాకు సంబంధించి ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజుల పర్యాటక ప్యాకేజీలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఒకరోజు ప్యాకేజీలో శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం, బెరం పార్కు, కొండపల్లి కోట, పవిత్రసంగమం (ఫెర్రీ ఘాట్), భవానీ ఐలాండ్, బాపూ మ్యూజియం,.
గాంధీ హిల్ ఉంటాయన్నారు. ఇదేవిధంగా మిగిలిన ప్యాకేజీల పూర్తి వివరాలు యాప్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. పర్యాటకులకు సేవలందించేందుకు ఇప్పటికే ఔత్సాహిక యువతీయువకులకు గైడ్లుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ వేదికగా అత్యంత సురక్షితమైన ఈ యాప్‌ను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
*పర్యాటక రాయబారులు మీరు..*
ఆటో, ట్యాక్సీలను నడిపే మీరు జిల్లా పర్యాటక రాయబారులని.. మీరు అందించే సేవలు పర్యాటకులకు మధురానుభూతులు మిగిల్చేలా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. మీ ఆతిథ్యం ఆధారంగానే విజయవాడతో పాటు జిల్లాకు కీర్తిప్రతిష్టలు పెరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
యాప్ సేవలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, పర్యాటకుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు కూడా వీలుకల్పించామన్నారు. ఉత్తమ సేవలు అందించిన వారిని సముచిత రీతిలో సత్కరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
*యాప్‌లో రైడ్ బుకింగ్‌తో ప్రయాణించిన కలెక్టర్:*
ఆంధ్రా ట్యాక్సీ యాప్ ఆవిష్కరణ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మొబైల్ యాప్ ద్వారా ట్యాక్సీ, ఆటో రైడ్‌లను బుక్ చేసుకొని బెంజ్ సర్కిల్ వరకు ప్రయాణించారు. యాప్ ద్వారా అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప.
ఇన్‌ఛార్జ్ ఆర్‌టీవో కె.వెంకటేశ్వరరావు, విజయవాడ ట్యాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.సాయిప్రసాద్, కోర్ కమిటీ సభ్యులు వి.బాబూరావు, రాష్ట్ర ఆటో ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఆదిబాబు, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు తదితరుల పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
