అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
ముందస్తు చర్యలు , అత్యవసర స్పందనల సమగ్ర నిర్ణయాత్మక ప్రణాళికకు రూపకల్పన
మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి
రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణ, నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఈ టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
24 మంది సభ్యులు
మొత్తం 24 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. జాతీయ స్థాయి వైద్య సంస్థ నిపుణులు, రాష్ట్ర పశుసంవర్ధక, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, వ్యవసాయ శాఖ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో అంటువ్యాధులు (డెంగీ, మలేరియా, డయేరియా టీబీ, లెప్రసీ, itara) ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు, అకస్మాత్తుగా వ్యాధులు వ్యాప్తి చెందిన సందర్భాలలో తక్షణమే చేపట్టవలసిన నియంత్రణ చర్యలపై ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి వ్యూహాత్మక ప్రణాళిక (స్ట్రాటజిక్ ప్లాన్) రూపొందిస్తుంది.
ఆసుపత్రుల సన్నద్ధత, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల అమలు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ (RRTs) విధులు , తదితర అంశాల గురించి ఈ ప్రణాళికలో పొందుపరచనున్నారు . ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై రాష్ట్రంలో అంటువ్యాధుల కేసుల స్థితిగతులు, అమలవుతున్న నియంత్రణ చర్యలు, ఇతర సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహిస్తుంది.
సభ్యులు ఎవరెవరు అంటే
ఈ కమిటీలో సభ్యులుగా Dr Himanshu Chauhan- Additional Director and Head- IDSP, CSU, వేలూరు సీఎంసీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగాధిపతి డాక్టర్ జార్జ్ వర్గీస్, మంగళగిరి ఎయిమ్స్ క్లినికల్ మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సుమిత్ రాయ్, త్రిశూర్ జేఎంజే చెస్ట్ సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జూడో జోసఫ్, కస్తూర్బా వైద్య కళాశాల మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ చిరంజయ్ ముఖోపాధ్యాయ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎన్‌పీఓ డాక్టర్ సౌరబ్, ఇక్వాయ్ డైరెక్టర్ డాక్టర్ రంగారెడ్డి, డిల్లీలోని ఎన్‌సీబీడీసీ– డెంగ్యూ డివిజన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కల్పన సభ్యులుగా ఉన్నారు.
ప్రభుత్వ శాఖల అధికారులు కూడా
అలాగే సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ చక్రధరబాబు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ సంపత్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ మంజీర్ జిలానీ, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ రీజినల్ డైరెక్టర్ అనురాధ, గుంటూరుకు చెందిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణులు డాక్టర్ కల్యాణ్ చక్రవర్తితో పాటు వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో ఉన్న అధికారులు ప్రత్యేక కమిటీ సభ్యులుగా ఉన్నారు’ అని మంత్రి సత్యకుమార్ వివరించారు .
