Home South Zone Andhra Pradesh గుంటూరు పశ్చిమ అభివృద్ధి పై కూటమి నేతల సమన్వయం |

గుంటూరు పశ్చిమ అభివృద్ధి పై కూటమి నేతల సమన్వయం |

0

గుంటూరు పశ్చిమ అభివృద్ధి పై ఎన్డీయే కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం ఉందని, మేయర్ కోవెలమూడి రవీంద్ర కు తమకు అంతర్గత విభేదాల ప్రచారం నిరాధారమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
*ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావిస్తూ..

2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన మొదటి రోజు నుంచే గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) తమకు పూర్తి స్థాయిలో సహాయ-సహకారాలు అందించారని తెలిపారు. ఎమ్మెల్యేగా తాము, ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ , మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర అలాగే కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా, నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నామని పేర్కొన్నారు.

మేయర్ ఎన్నికైన నాటి నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఆయన సంపూర్ణ సహకారం అందించారని, అదే విధంగా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి వేగం మరింత పెరిగిందని తెలిపారు.

ఇటీవల విలీన గ్రామాల అంశంపై వచ్చిన వ్యాఖ్యల విషయంలో, ఒకే ఒక్క అంశానికి మాత్రమే తమ అభ్యంతరం వ్యక్తం చేశామని స్పష్టం చేశారు. ఆ అంశంపై ముందుగా కలిసి చర్చ జరగలేదన్నది వాస్తవమని, అలాగే తమ నియోజకవర్గానికి సంబంధం లేని పెదకాకాని గ్రామాన్ని విలీనంలో చేర్చడంపై మాత్రమే అభ్యంతరం తెలిపామని చెప్పారు. దీన్ని మేయర్ గారి వ్యక్తిగతంగా వ్యతిరేకించినట్లు భావించడం సరికాదని, మిగతా అన్ని అంశాల్లో తమ మధ్య పూర్తి ఏకాభిప్రాయం ఉందని తెలిపారు.

ఈ ఒక్క అంశాన్ని మినహాయిస్తే, మేయర్ తో కలిసి, ఎంపీ సహకారంతో, కూటమి నేతలందరం కలిసే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లలో కూటమి అభ్యర్థులను పూర్తి స్థాయిలో గెలిపించేందుకు, మేయర్ ఎంపీ తో పాటు కూటమి పార్టీ నేతలందరం కలిసి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.

కొంతమంది కావాలనే ఈ విషయాన్ని వక్రీకరించి, అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలకు ఎలాంటి ఆధారాలు లేవని ఎమ్మెల్యే ఖండించారు. తాము ఏ అంశాన్ని వ్యతిరేకించామో, ఆ అంశాన్నే స్పష్టంగా మీడియా ముఖంగా తెలియజేశామని చెప్పారు.

తమ మధ్య ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేదా భేదాభిప్రాయాలు లేవని, అన్నా, చెల్లెలు లాగా ఐక్యతతో పనిచేస్తున్నామని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ సారధ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, కూటమి ప్రభుత్వంతోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మరింత మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఎవరైనా అపోహలకు లోనై ఉంటే, వాటిని సరిదిద్దుకోవాలని కోరుతూ, కూటమి ఐక్యతపై అనవసర ప్రచారాలకు తావివ్వవద్దని ఎమ్మెల్యే గళ్ళా మాధవి విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS

Exit mobile version