ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి మార్కుల జాబితాలో ఒకేషనల్ సబ్జెక్టు మార్కులను చేర్చనున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఈ విషయాన్ని తెలిపారు. వృత్తి విద్య కోర్సులు ఇకపై విద్యార్థుల మార్కుల గ్రేడింగ్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టడానికి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. వృత్తి విద్యను కేవలం ఒక అదనపు సబ్జెక్టుగా కాకుండా.. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మార్పు విద్యార్థులకు కొత్త అవకాశాలను అందిస్తుందన్నారు శ్రీనివాసరావు.
విజయవాడలో రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు అట్టహాసంగా జరిగాయి. 26 జిల్లాల నుంచి 10 రకాల వృత్తులలో 260 ప్రాజెక్టులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులు స్వయంగా తయారుచేసిన దుస్తులను ధరించి ర్యాంప్‌పై నడిచి అందరినీ ఆకట్టుకున్నారు. విజేతలకు నగదు బహుమతులు, పతకాలు అందజేశారు. ఈ పోటీల ముగింపు సందర్భంగా, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకున్నారు. వారు స్వయంగా రూపొందించిన దుస్తులను ధరించి ర్యాంప్ వాక్ చేశారు.
ఇది వారి నైపుణ్యానికి, ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రేడ్ల వారీగా బహుమతులు అందించారు. ప్రథమ స్థానం సాధించిన వారికి రూ.25వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.15 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.10 వేలు చొప్పున నగదు బహుమతులతో పాటు పతకాలు అందజేశారు. ఈ బహుమతులు విద్యార్థులను మరింత ప్రోత్సహించేలా ఉన్నాయి.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ మార్పులకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. జనరల్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ కేటగిరీల విద్యార్థులు ఈ మార్పులను తప్పక గమనించాలని సూచించింది. ఈ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల వెయిటేజీ ఉండదు. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులకు 7 పేపర్ల విధానాన్ని అమలు చేయనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్.
గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కో పేపర్ ఉంటుంది. ప్రతి పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ సైన్స్ సబ్జెక్టులో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో 50 మార్కుల చొప్పున జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్‌లో కాంపోజిట్ పేపర్–వన్ 70 మార్కులకు, పేపర్–టు 30 మార్కులకు ఉంటుంది.




