కర్నూలు : అవకతవకలకు పాల్పడితే ఇంటికే..• పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వీడండి• సిబ్బందికి కమిషనర్ పి.విశ్వనాథ్ హితవు• 3, 5వ శానిటేషన్ డివిజన్లలో అకస్మిక తనిఖీలు• పలు అక్రమాలు గుర్తింపు.. సిబ్బందిపై చర్యలకు ఆదేశం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అవకతవకలు పాల్పడినా సంబంధిత ఉద్యోగి ఇంటికే వెళ్లాల్సి వస్తుందని, శుభ్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు.
శనివారం తెల్లవారుజామున కమిషనర్ 3, 5వ శానిటేషన్ డివిజన్లలో అకస్మిక తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ్య పనుల నిర్వహణను పరిశీలించారు. తనిఖీల్లో పలు అవకతవకలు వెలుగులోకి రావడంతో కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.గత డిసెంబర్ నెలకు సంబంధించిన హాజరు పట్టికలో వరుసగా 15 రోజులపాటు హాజరు, గైర్హాజరు నమోదు చేయకుండా కేవలం చుక్కలు మాత్రమే పెట్టడంపై కమిషనర్ మండిపడ్డారు. అనారోగ్య కారణాలతో విధులకు రాని కార్మికుల స్థానంలో ఇతరులను నియమించుకునే విషయంలో పర్యవేక్షణ లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
“మద్యం సేవించే అలవాటు ఉన్న వ్యక్తులకు కూడా బదులు అవకాశం ఇస్తారా?” అంటూ అధికారులను ప్రశ్నించారు.మౌర్యఇన్ సమీపంలోని మహమ్మదీయ వక్ఫ్ బోర్డు కాంప్లెక్స్ వద్ద ప్రధాన రహదారి గుండా నెలల తరబడి చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీ కాలువ పూర్తిగా పూడికతో నిండిపోవడంపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత షాపుల నిర్వాహకులకు శుభ్రతపై హెచ్చరికలు జారీ చేయడంలో శానిటేషన్ సిబ్బంది అలసత్వం ప్రదర్శించడాన్ని అసహనం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు సానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు శానిటేషన్ కార్యదర్శులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరికీ ఉదయం 05:45 కల్లా ఎఫ్‌ఆర్‌ఎస్ పూర్తి చేసి విధుల్లోకి వెళ్లాలని చెప్పినా 07:30 వరకు వాహనాలు రహదారులపైకి రాకపోవడం ఏమిటి?” అంటూ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మాట్లాడటం లేదని, నగరాన్ని శుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా క్రమశిక్షణతో పని చేయాలని సూచిస్తున్నట్లు తెలిపారు. తాను కర్నూలులో ఉన్నంతకాలం అవకతవకలు, అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వబోమని స్పష్టం చేశారు.
పారిశుద్ధ్య పనుల్లో దీర్ఘకాలిక సమస్యలు ఉంటే నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపుల కోసం ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ 2వ డివిజన్‌లో హాజరు పట్టికను తనిఖీ చేశారు.తనిఖీల్లో కార్యదర్శి నాగరాజు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు ఎం.శ్రీనివాసులు, నాగేశ్వరరావు, టిఏఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
