Home South Zone Andhra Pradesh హాస్టల్ వసతుల జిఓ 46 అమలు ఎందుకు? |

హాస్టల్ వసతుల జిఓ 46 అమలు ఎందుకు? |

0

హాస్టల్స్‌లో వసతుల జిఓ 46 ఎందుకు అమలు చేయడం లేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
అమరావతి : రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్స్‌లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రతి 15 రోజులకోసారి సంక్షేమ హాస్టళ్లను సందర్శించి రాత్రి అక్కడ బస చేయాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జిఓ 46ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది.

హాస్టళ్లలోని పిల్లలకు తాగునీరు ఎప్పటిలోగా అందిస్తారో చెప్పాలని ఆదేశించింది. 320 కొత్త ఆర్ఒ ప్లాంట్లు మంజూరయ్యాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే అవి సరిపోవని అభిప్రాయపడింది. హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది.

కమిటీలో సంక్షేమ శాఖల అధికారులకు చోటు కల్పించాలంది. సిఎస్‌ స్వయంగా పర్యవేక్షణ చేయాలంది. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పన ఉండాలంది. తాగునీరు, మరుగుదొడ్ల తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక రూపొందిచాలంది. హాస్టల్స్‌లో వసతులు లేవంటూ కాకినాడ జిల్లాకు చెందిన కె అఖిల్‌ శ్రీగురుతేజ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది.పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం హాస్టళ్లలో 86 మంది విద్యార్థులు కామెర్ల సమస్యతో ఇబ్బంది పడ్డారు.

ఒకరు మరణించారు. మరో 150 మంది విద్యార్థులు ఇతర సమస్యలతో ఆస్పత్రిపాలయ్యారు. దీనిపై హైకోర్టు, విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శితో నివేదిక తెప్పించుకుంది. బావిలోని నీటిని నేరుగా నీళ్ల ట్యాంకుకు పంపించి వాటినే విద్యార్థులు తాగునీరుగా వినియోగించారని నివేదికలో పేర్కొంది.

611 మంది విద్యార్థులకు 58 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, ఇందులో 40 దొడ్లను వ్యాధి ప్రబలిన తర్వాతే కట్టారని నివేదికలో ఉంది. 11 మరుగుదొడ్లకు, 2 స్నానపు గదులకు తలుపులు కూడా లేవని ఉంది. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు.. సిఎస్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

#Narendra

Exit mobile version