జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటిన బాపట్ల జిల్లా పోలీస్ కానిస్టేబుల్
కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
బాపట్ల: బాపట్ల పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ, స్విమ్మింగ్ పోటీలలో రాణించి జిల్లా పోలీస్ కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రశంసించారు. శ్రీ రామ్ సీ స్విమ్మింగ్ క్లబ్ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రం, పోరుబందర్‌లోని అరేబియా సముద్ర తీరంలో నిర్వహించిన ‘ఆల్ ఇండియా సీ స్విమ్మింగ్’ పోటీల్లో కానిస్టేబుల్ పి.నాగ బ్రహ్మారెడ్డి ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ గారిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఎస్పీ గారు బ్రహ్మారెడ్డిని మెడల్‌తో సత్కరించి, ప్రశంసా పత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా పీజీఆర్ఎస్ (PGRS) విభాగంలో విధులు నిర్వహిస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ పి. నాగ బ్రహ్మారెడ్డి ఇటీవల గుజరాత్ రాష్ట్రం, పోరుబందర్లో జనవరి 3, 4 తేదీలలో జరిగిన ఆల్ ఇండియా సీ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. జనవరి 4న జరిగిన 5 కిలోమీటర్ల స్విమ్మింగ్ పోటీని 1 గంట 40 నిమిషాలలో పూర్తి చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. జనవరి 3న జరిగిన 1 కిలోమీటర్ స్విమ్మింగ్ పోటీని 22 నిమిషాలలో ముగించి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ నాగ బ్రహ్మారెడ్డి జాతీయ స్థాయిలో వరుసగా పతకాలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. గతంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన వివిధ పోటీల్లో పాల్గొని మొత్తం 15 మెడల్స్ సాధించారని గుర్తుచేశారు. నిరంతర కృషి, పట్టుదల ఉంటేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. ముందుముందు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని విజయం సాధించాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు. క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చని, శారీరక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది బ్రహ్మారెడ్డిని ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు పోలీస్ శాఖ తరపున ప్రోత్సాహం ఉంటుందని ఎస్పీ గారు తెలిపారు.
#Narendra




