Home South Zone Andhra Pradesh ఇకపై ధాన్యం కొనుగోలు రోజే చెల్లింపులు మంత్రి నాదెండ్ల మనోహర్

ఇకపై ధాన్యం కొనుగోలు రోజే చెల్లింపులు మంత్రి నాదెండ్ల మనోహర్

0

24 గంటల్లోపు 94 శాతం నగదు రైతుల ఖాతాల్లో జమ-
ఇకపై ధాన్యం కొనుగోలు జరిగిన రోజే చెల్లింపు – మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నిర్వహిస్తోందని, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్‌లో ధాన్యం కొనుగోలు అంశంపై సివిల్ సప్లై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2025-2026 ఖరీఫ్ మాసంలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపుల్లో 94 శాతం నగదు 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే అదే రోజు సాయంత్రం రైతు ఖాతాలో నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఎదురైన లోపాలను సమీక్షించి, రాబోయే రబీ సీజన్‌కు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని అధికారులకు సూచించారు.
త్వరలో తిరుపతిలో రబీ సీజన్ కు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్కేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే విధంగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

రైతులకు కనీస మద్దతు ధర అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

తేమ శాతం, జీపీఎస్, ట్రాన్స్పోర్ట్‌కు సంబంధించిన సమస్యలను సమర్థవంతంగా అధిగమించామని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,83,623 మంది రైతుల నుంచి 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన మొత్తం విలువ చేసి, రూ. 9,890 కోట్ల ఇందులో 24 గంటల్లో రూపాయలు 9800 కోట్ల రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు.
రైతులు ఇబ్బందులు పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు సదుపాయం కల్పించి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపు చేపట్టామని తెలిపారు.
క్షేత్రస్థాయిలో పర్యటనల సమయంలో రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ సదుపాయాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు అంచనాలతో సిద్ధంగా ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఈ సమావేశంలో సివిల్ సప్లై వీసీ & ఎండీ ఢిల్లీ రావు ఐఏఎస్, పౌర సరఫరా శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version